Krishna Pushkaralu 2016

కృష్ణా పుష్కరాలు 2016:


వచ్చే ఏడాది ఆగస్టులో రానున్న కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. కృష్ణానది ప్రహస్తున్న నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నది. ఈ దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించినట్లుగానే కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ సెక్రటరీ శివశంకర్, ఇన్‌చార్జి అడిషనల్ కమిషనర్ కృష్ణవేణితోపాటు వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

అన్ని శాఖలు కృష్ణా పుష్కరాల కోసం సమగ్ర ప్రణాళికలు, అంచనాలను సిద్ధం చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఆదేశాలిచ్చారు. గోదావరి పుష్కరాలకు కావాల్సినన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనందున కృష్ణా పుష్కరాలకు కేంద్రం నిధులు ఇచ్చేలా ముందుగానే ప్రయత్నాలను ప్రారంభించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. క్షేత్రానికి, తీర్థానికి ప్రాధాన్యతను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సూచించారు. మరోసారి నవంబర్ 5న సమావేశం కావాలని, ఆ తేదీ నాటికి నిర్దిష్ట ప్రణాళికలతో సిద్ధం కావాలని నిర్ణయించారు. మే 2016 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని దేవాలయాలన్నింటినీ పునరుద్ధరించాలని, స్నానఘట్టాల వరకు రోడ్లు వేయాలని, నిరంతరంగా విద్యుత్ ఏర్పాట్లు ఉండాలని దేవాదాయశాఖ మంత్రి సూచనలు చేశారు.

రెండు జిల్లాలలో 79 స్నానఘట్టాలను ఏర్పాటు చేసే బాధ్యతలను రాష్ట్ర నీటి పారుదలశాఖకు అప్పగించారు. గోదావరి పుష్కరాల్లో వ్యవహరించిన తరహాలోనే ఆర్ అండ్‌బీ, నీటిపారుదల, విద్యుత్, మంచి నీటి సరఫరా, దేవాదాయశాఖ, పోలీసు, అగ్నిమాపకశాఖ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. గత కృష్ణా పుష్కరాలకు 44 లక్షల భక్తులు హాజరయ్యారని, ఈ సారి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనాలు వేస్తున్నది. నాగార్జునసాగర్‌ను ప్రత్యేక పుష్కర ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

Source: Namasthe Telangana

 

You may also like...

↓